Display:
శృంగార సంకీర్తన
రేకు: 1909-2
సంపుటము: 29-50
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇదివో విన్నవించితి మిన్నిటా జాణవు నీవు
మదిరాక్షి మే లెరిఁగి మన్నించఁదగును
॥పల్లవి॥
చెలి నీవు వచ్చేవంటా సిగ్గుల ముగ్గులు వెట్టి
తళుకుఁజూపుల తమ్మిదండలు గట్టి
పలచని చెమటల పన్నీరు చిలికించి
వెలయ మోవి తేనెల విందాయితము సేసె
॥ఇది॥
దొరయ చెక్కుటద్దాల తోరణములుగా గట్టి
గరిమఁ దొడ లరఁటి కంబాలు సేసె
నిరతిఁ బులకలనే నించె ముత్తేలకుచ్చులు
పరగ గుబ్బలనే పైఁడికుండ లెత్తెను
॥ఇది॥
కమ్మని మేని తావుల గంద మట్టె యమరించె
పమ్మి పలుకుల కప్రబాగాలు గూర్చె
ఇమ్ముల నలమేల్మంగ యీకె శ్రీవేంకటేశ్వర
నెమ్మిఁ గూడితి వింతలో నీవే యింటికి వచ్చి
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము