శృంగార సంకీర్తన
రేకు: 1909-6
సంపుటము: 29-54
రేకు: 1909-6
సంపుటము: 29-54
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| ఎంతసేసినా నీకు యెరవులవాఁ డితఁడు సంతతము తొల్లి నాకు చనవిచ్చినాఁడు | ॥పల్లవి॥ |
| తెరమరఁగున నుండి తేనెగార మాఁటలాడి మరిగించితి వవునే మగని నీవు సరసము లాడుకొంటా సన్నలు సేసుకొంటా తరితీపుల నితనిఁదగిలించుకొంటివే | ॥ఎంత॥ |
| వొంటినుండి యేకతాన వొడఁబరచి పరచి వెంటఁదెచ్చుకొంటివౌనే విభుని నీవు నంటులు చూపుకొంటా నవ్వులు నవ్వుకొంటా ఇంటిలో గూడితివౌనే యీతనితోను | ॥ఎంత॥ |
| గుఱుతులు మేన నించి గుబ్బుల నూఁది యూఁది కఱఁగించితివౌనే కాంతుని నీవు యెఱిఁగి శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె మఱి నీవితని దిక్కు మళ్ళిచూడనేఁటికే | ॥ఎంత॥ |


