Display:
శృంగార సంకీర్తన
రేకు: 1910-2
సంపుటము: 29-56
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
అప్పటనుండి నాకు నందుకే వేఁడుకోఁబట్టె
ముప్పిరి వేవేలకును మొక్కేఁ జుమ్మీ నేను
॥పల్లవి॥
మేలమాడేవేళ నిన్ను మీరి నే నేమంటినో
బేలనై నీతో నెంత పెనఁగితినో
చేలికొంగు నీవంటఁగా చెయ్యేడఁ దాఁకించితినో
కేలెత్తి నీకిదివో మొక్కేఁ జుమ్మీ నేను
॥అప్ప॥
నీ కూడిగము సేయఁగా నిన్నఁ గా లేడ సోఁకెనో
ఆకుమడిచియ్యఁగా నిన్నంటెనో గోరు
దాకొని నీతో నవ్వఁగా తమ్ముల మేడఁజిందెనో
యీకడ మొక్కేఁ జుమ్మీ యెరఁగను నేను
॥అప్ప॥
చెనకి కాఁగిలించఁగా చెమ టెంత వడిసెనో
యెనయఁగా నీ చన్ను లెంత వొత్తెనో
నిను, శ్రీవేంకటేశఁడ నేఁ జేసిన చేఁతకెల్లా
మునుపనే వినయాన మొక్కేఁ జుమ్మీ నేను
॥అప్ప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము