Display:
శృంగార సంకీర్తన
రేకు: 1910-3
సంపుటము: 29-57
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ముసి ముసి నవ్వులతో మోములు వంచుకోకురే
పసలుగా వేడుకతో పతిసేవ సేయరే
॥పల్లవి॥
నెయ్యముగల చోటికి నేరమి రాదు
యియ్యకోలై పొసఁగితే నెగ్గులేదు
చెయ్యారఁ జెనకితేను సిగ్గులెడయు
యెయ్యడా వలపుజాడ లెరుఁగుకోరే
॥ముసి॥
ననిచినవారు పెనఁగులాడరు
మనసులో గలసితే మరఁగేడది
చనవులు మీరితేను జారుఁ జలము
గొనకొన్న వలపుల గురుతు లివిగోరే
॥ముసి॥
బత్తి సేసితేఁ జలము పరిసిపోవు
పొత్తు గలసితే పొరపొచ్చ మేడది
యత్తల శ్రీవేంకటేశుఁ డిటు మిమ్ము నేలినాఁడు
హత్తిన వలపుజాడ లని యెంచుకోరే
॥ముసి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము