శృంగార సంకీర్తన
రేకు: 1910-4
సంపుటము: 29-58
రేకు: 1910-4
సంపుటము: 29-58
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పళవంజరం
| కాఁపురాలు సేసేవారి గాకుసేయఁ దగునటే మాపు దాఁకా నీవెంత మలసేవే యెదుట | ॥పల్లవి॥ |
| మచ్చిక నే నితనితో మాఁటపలుకు లాడఁగా ఇచ్చటికి వచ్చి నీవేమి వినేవే అచ్చలాన నిద్దరమూ నాసతోడఁ గూచుండఁగా కచ్చుపెట్టుక నీవేల కాచుకవుందానవే | ॥కాఁపు॥ |
| ననుపున మాలో నేము నవ్వుకొంటా నుండఁగాను పనివూని నీవేల తప్పక చూచేవే పెనఁగి వొండొరులము ప్రియములు చెప్పుకోఁగా వెనుకొని నీవేల వెరగువడేవే | ॥కాఁపు॥ |
| అక్కజపురతుల నే మట్టె వోలలాడఁగాను యెక్కడనుండో నీవు యెట్టు వచ్చేవే ఇక్కువ శ్రీవేంకటేశుఁ డేలఁగా నే మెచ్చితేను చక్కటి నీ వెందాఁకా నెచ్చరికలు సేసేవే | ॥కాఁపు॥ |


