Display:
శృంగార సంకీర్తన
రేకు: 1910-5
సంపుటము: 29-59
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
నాకే మేలువాఁడనంటా నమ్మిక లిచ్చేవు నీవు
నీకు దేనినై వుందాన నే నెదురాడేనా
॥పల్లవి॥
కన్నుల చూపులనే కరగించె నాకె నిన్ను
సన్నలా చాయలాఁ గొంత చల్లె వలపు
కిన్నెర మీఁటులు మీఁటి గిలిగించె నింతపడి
యిన్నిటా నాపె పొందులు యెట్టు మరచేవయా
॥నాకే॥
మంతనపు మాఁటలనే మరిగించె నాకె నిన్ను
వింత వింత నవ్వులనే వీఁడు దోడాడె
చెంతనుండి వీడె మిచ్చి చిమ్మిరేఁచె నీమనసు
యంతైనా నాపె పొందులు యెట్టు మరచేవయా
॥నాకే॥
మిక్కుటపు సేవలనే మెప్పించె నాకె నిన్ను
తక్కక రతులనే దక్కఁగొనెను
అక్కరతో నన్నేలితి వప్పటి శ్రీవేంకటేశ
యెక్కడా నాపె పొందులు యెట్టు మరచేవయా
॥నాకే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము