Display:
శృంగార సంకీర్తన
రేకు: 1922-1
సంపుటము: 29-67
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతవరాళి
ఏకతాన మీ యిద్దరి యేలాటము లెట్టివో
నీకు వలచు నాతఁడు నెమ్మది నుండఁగదే
॥పల్లవి॥
పెనఁగుతా రమణుఁడు ప్రియము చెప్పీ నీకు
వినవే యాతనిమాఁట వేడుకతోను
మునుకొని సారెరారె మొగము దప్పక చూచి
యెనసీని చేతులెత్తి యిఁక మొక్కవే
॥ఏక॥
కొప్పు దువ్వి బుజ్జగించి కొంగు వట్టుకున్నాఁడు
చెప్పినట్టు సేయవే చెలువునికి
చిప్పిల మర్మములంటి చెక్కు నొక్కి వేఁడుకొనీ
ఇప్పు డిట్టె కానిమ్మని ఇయ్యకొనవే
॥ఏక॥
కడు బత్తితోడుత కాఁగిలించుకొనీ నిన్ను
వొడికమున నొక్కటై వుండవే నీవు
యెడయక శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నేలె
వొడఁబడికతో రతి నోలలాడవే
॥ఏక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము