Display:
శృంగార సంకీర్తన
రేకు: 1922-3
సంపుటము: 29-69
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
కాఁగిటిలోదాని కింకా నెడమాఁట లేల
లోఁగనేల పతియిచ్చలోనే రమ్మనవే
॥పల్లవి॥
యెనసి వుండినదాని కెగ్గులు వట్టఁగ నేల
చనవరి దానికి సాదించ నేల
మనసొగ్గినదానికి మరి పెనఁగఁగ నేల
ననిచిన పతితోను నగును రమ్మనవే
॥కాఁగి॥
సేసవెట్టినదానికి సిగ్గులు వడఁగ నేల
ఆసగలదానికి నలయ నేల
వాసివంతులదానికి వట్టి విచారము లేల
యీసరిఁ బతి పెండ్లిపీఁ టెక్కును రమ్మనవే
॥కాఁగి॥
వావి గూడినదానికి వక్కణ లడుఁగ నేల
కైవసమైనదానికి కాతర మేల
దేవులయినదానికి తెరమరఁ గిఁక నేల
శ్రీవేంకటపతి వచ్చెఁ జేకొను రమ్మనవే
॥కాఁగి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము