Display:
శృంగార సంకీర్తన
రేకు: 1923-1
సంపుటము: 29-73
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏమి గారణమె తమ కిద్దరము నొక్కటె
ప్రేమము లిరుదెసలాఁ బెనఁగొనఁగాను
॥పల్లవి॥
సేసవెట్టి పతిఁజూచి సిగ్గున నే నుండితేను
వాసించు పువ్వులకేల వాఁడి వచ్చెనే
ఆసతోఁ దెరమాఁటున నట్టెనే నుండితేను
మూసి చిలుకలకేల మొగా లెఱ్ఱనాయెనే
॥ఏమి॥
తనియక లోలోనే తలపోసుకొంటేను
వనము కోవిలకేల వాకు వెళ్ళెనే
చెనకఁగా వాసితోడ శిరసు వంచుకొంటేను
వొనరఁ జల్లగాలికి నుడుక నేమిటికే
॥ఏమి॥
గక్కన శ్రీవేంకటేశుఁ గాఁగిలించుకొంటేను
నెక్కొని చిత్తమునకు నివ్వెరగేలే
చక్కఁగా నాతనితోను సరసము లాడితేను
వెక్కసపు రతులేల వెల్లివిరిసీనే
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము