శృంగార సంకీర్తన
రేకు: 1927-6
సంపుటము: 29-102
రేకు: 1927-6
సంపుటము: 29-102
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
| మగువకు నిన్నియును మంచివై యుండఁగవలె తగులై యుండఁజేయరే తరుణులాల | ॥పల్లవి॥ |
| సుదతికిఁ దుమ్మిదలు చుట్టములై యుండవలె పొదిగి తామరలు కొప్పున నించరే వదలక చందురుని వసముసేసుకోవలె పదిలానఁ గలువల పానుపు వరచరే | ॥మగు॥ |
| మందానిలుఁ డింతికి మరి చలువగావలె గందము మేను నిండాఁ గడు మెత్తరే చెంది కోవిలలతోడఁ జెలిమిసేసుకోవలె చందముగాఁ జిగురాకు చప్పరలు గట్టరే | ॥మగు॥ |
| కలికికి మదనుఁడు కాఁపుగా నుండఁగవలె చిలుకల వాసిన చీర గట్టరే యెలిమి శ్రీవేంకటేశుఁ డీఁకె నింతలోఁగూడె వెలయవలె సోబాన వేడుకతోఁ బాడరే | ॥మగు॥ |


