శృంగార సంకీర్తన
రేకు: 1929-2
సంపుటము: 29-110
రేకు: 1929-2
సంపుటము: 29-110
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఊరకున్నాఁ బోనీదు వుడివోని జవ్వనము తారుకాణ లివి నీకు దాఁగవచ్చునటరే | ॥పల్లవి॥ |
| కనుచూపులు సోఁకితే కలయికలు రేఁచును మనసు లెనసితేను మర్మము లంటు చెనకులు వేడుకైతే సేసిన చేఁతలు చెల్లు పెనచితే నొందొకటి పెనులంకెలే | ॥ఊర॥ |
| యెడమాఁటలు వింటేనే హెచ్చుఁ దరితీపులు బడివాయకుండితేఁ జొప్పఁడు జెలిమి వొడఁబాటు గలిగితే నొనగూడుఁ గాఁగిళ్ళు తడయ కొండొకటికిఁ దగులాయమే | ॥ఊర॥ |
| నవ్వులకు లోనైతే నాము లెక్కు వలపులు వువ్విళ్ళూరఁ బెనఁగితే నుబ్బించు మేను ఇవ్వల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్ను నేలె నివ్వటిల్ల నొండొంటితో నెరవైన జంటలే | ॥ఊర॥ |


