Display:
శృంగార సంకీర్తన
రేకు: 1931-2
సంపుటము: 29-122
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
మిక్కిలి కోమలమైన మెలుఁత యీకె
మక్కువ లీడేర్చి యిట్టె మన్నించరాదా
॥పల్లవి॥
చెమ్మఁ జెమటలతోడ చిటపొట మనఁగాను
యిమ్ముల బాదాలొతై యీకె యిందాఁకా
నెమ్మదిఁ దాళగతులు నీకెందాఁకా నాలించేవు
కమ్మి యలపెల్లాఁ దీర గాఁగిలించరాదా
॥మిక్కి॥
కందువఁ బయ్యదకొంగు గళబెళమనఁగాను
ఇందరితోఁ గుంచ వేసె నీకె యిందాఁకా
సందడితో నారవళే సారెకు నేమి వినేవు
అందపు నీ మోవి ఇచ్చి ఆదరించరాదా
॥మిక్కి॥
కడు సకినల సజ్జ కవకివమనఁగాను
యెడపక నిన్నుఁ గూడె నీకె ఇందాఁకా
అడరి శ్రీవేకంటేశ యలమేలుమంగ తానే
తడవెంత దలఁచేవు దయతో మెచ్చరాదా
॥మిక్కి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము