శృంగార సంకీర్తన
రేకు: 1931-3
సంపుటము: 29-123
రేకు: 1931-3
సంపుటము: 29-123
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఇంతటఁ గరఁగవద్దా యిచ్చగించి నీ మనసు చెంతలఁ జూచినవారి చిత్తాలు గరఁగెను | ॥పల్లవి॥ |
| చెప్పరాని ప్రియములు చెప్పి నీకు జవరాలు వుప్పతిల్లుఁ దమితోడ నూరకుండెను కప్పురపు బొమ్మ నీకుఁ గానుకగాఁ జేతికిచ్చి దప్పిదేరి సిగ్గుతోడ దలవంచుకొనెను | ॥ఇంత॥ |
| సేయరాని వూడిగాలు సేసి సేసి కాతరాన పాయరాక తొడమీఁదఁ బవ్వళించెను కాయజకేలికి నిన్ను గమ్మరఁ జిలువఁబూని ఆయడ చిరునవ్వుతో నట్టె గుక్కుకొనెను | ॥ఇంత॥ |
| చూపరాని మోమమెల్లాఁ జూపి నిన్ను మెప్పించి దాపుగా నీరెంటెములో దాఁ జొచ్చెను యేపున శ్రీవేంకటేశ యీకె యలమేల్మంగ నీపొందు సేసి తన నేరుపు మెరసెను | ॥ఇంత॥ |


