Display:
శృంగార సంకీర్తన
రేకు: 1932-3
సంపుటము: 29-129
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
గుట్టుతోడ నుండవే కొమ్మలెల్లా మెచ్చేరు
గట్టిగాఁ దానే వచ్చి కరుణించి నీతఁడు
॥పల్లవి॥
నవ్వకునే యంతేసి నయగారి తనముల
తవ్వకువే వలపులు దప్పిగొనీని
రువ్వకువే మాఁటల రొక్కముగా నొక్కమాటే
నివ్వటిల్ల నీకంటె నేరుపరి యీతఁడు
॥గుట్టు॥
మొక్కకువే సారె సారె ముదిరీ నీ వావులు
చొక్కకువే కన్నులను సొలపుదేరి
నిక్కకువే యంతేసి నేఁడె నీ సొబగులెల్లా
నెక్కొని నీకంటేను నెరవాది యీతఁడు
॥గుట్టు॥
పెంచకువే పంతాలు పెనఁగి పెనఁగి నీవు
వంచకువే నీ శిరసు వట్టి సిగ్గుల
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నీ వితని
మించి కూడేవు నీకంటె మేటిజాణఁ డీతఁడు
॥గుట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము