శృంగార సంకీర్తన
రేకు: 1933-1
సంపుటము: 29-133
రేకు: 1933-1
సంపుటము: 29-133
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎంత బాఁతో యాపె నీకు ఇందుకు దొరకొంటివి పొత నన్నొడఁబరచి పొసఁగఁ జెప్పేవు | ॥పల్లవి॥ |
| చెలరేఁగి యాపె నీకుఁ జేసేటి విన్నపాలెల్లా పలుమారు నూఁకొని తప్పక వినేవు యెలమి నప్పటి నీకు నిచ్చేటి కానుకలెల్లా అలరుచుఁ జేయి చాఁచి యందుకొనేవు | ॥ఎంత॥ |
| వేడుకతో నాపె నీకు విందులు వెట్టినందుకు ఆడనుండి సారె సారె నారగించేవు జోడు గూడి నిన్నుఁ గడుఁ జొక్కించిన రతులకు యీడకు వచ్చి నాతోను యెంతో కొనియాడేవు | ॥ఎంత॥ |
| కూరిమితో నాపె నిన్నుఁ గొసరి నవ్వినందుకు చేరి కాఁగిలించుకొని చెక్కునొక్కేవు యీరీతి శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి మేరమీర కాపెతోడ మేలమాడేవు | ॥ఎంత॥ |


