శృంగార సంకీర్తన
రేకు: 1934-3
సంపుటము: 29-141
రేకు: 1934-3
సంపుటము: 29-141
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇంతటిదానవు నీవు యెంతని పొగడవచ్చునే పొంతఁ గోర కెట్టుందునే పొలఁతి నీ విభుఁడు | ॥పల్లవి॥ |
| సెలవుల నవ్వు దేరీ చెక్కుల మదము గారీ నెలఁత నీమాఁటలఁ దేనియ లూరీని కలికి వన్నిటా నీవు గక్కన నిన్నుఁ జూచితే వలవ కెట్టుండునే వనిత నీ విభుఁడు | ॥ఇంత॥ |
| మోమున వెన్నెల గాసీ మూపునఁ దురుము రాసీ ఆమని చన్నులురమునందునఁ బైసేసీ నీ మంచి చక్కఁదనాలు నెమ్మది నెంచి చూచితే కామించ కెట్టుండునే కాంత నీ విభుఁడు | ॥ఇంత॥ |
| మోవిపైనే చిగురెక్కీ మొనగోళ్ళఁ జేఁగలెక్కీ భావించితే హంసగతి పాదాలఁజిక్కీ యీవేళ శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁగూడె సేవగొన కెట్టుండునే చెలియీ నీ విభుఁడు | ॥ఇంత॥ |


