Display:
శృంగార సంకీర్తన
రేకు: 1936-3
సంపుటము: 29-153
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
ఎంతని పొగడేమమ్మా యిటువంటి సొబగులు
యింతులలో నెంచిచూడ నీపెకే తగును
॥పల్లవి॥
చన్ను లెంత గనమే జవరాలికి । యీ -
కన్నులతీరు చూడరే కాంతలాల
పున్నమచంద్రుఁడుగదె పొలఁతి మోము
యిన్నేసి సింగారాలు యీపెకే తగునే
॥ఎంత॥
తురు మెంత వొప్పిదమే తొయ్యలికిని । తన -
కరముల చెలువము గంటిరటరే
మరునివిండ్లేకదే మంచి బొమలు
ఇరవైన చక్కఁదనా లాపెకే తగునే
॥ఎంత॥
నడు మెంత వొరపే నలినాక్షికి । చిన్ని -
యడుగుల చిగురుల యందమేకదే
అడరి శ్రీవేంకటేశు నలమేల్మంగ । యీ -
యెడయని ముచిపెము లీపెకే తగునే
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము