Display:
శృంగార సంకీర్తన
రేకు: 1938-1
సంపుటము: 29-163
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
చిన్నదాన నంటాను సిగ్గు అంతేసేఁటికి
పన్నుక నీ విలాసాలు పచారించవే
॥పల్లవి॥
చెలియ నీ మాఁటలకుఁ జెవి యొగ్గీ నాతఁడు
వెలయ నీ మనవులు విన్నవించవే
పలచని కెమ్మోవికి బాఁతిపడీ నాతఁడు
సొలయుచు నిట్టె చవి చూపఁగదవే
॥చిన్న॥
తక్కక నీ మోము చూడఁ దమకించీ నాతఁడు
నెక్కొని యెట్టనెదుట నిలుచుండవే
వెక్కసపుఁ జన్ను లంటి వేగిరించీ నాతఁడు
గుక్కక మిక్కక దండఁ గూచుండఁగదవే
॥చిన్న॥
కచ్చుక నీ పొందులకు గాచుకున్నాఁ డాతఁడు
యిచ్చగించి కాఁగిటికి నియ్యకొనవే
ఇచ్చట శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె
మెచ్చి మెచ్చి పొగడుతా మేలమాడఁగదవే
॥చిన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము