Display:
శృంగార సంకీర్తన
రేకు: 1938-2
సంపుటము: 29-164
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
ఇన్నాళ్ళు నెఱఁగము నిటువంటివి
సన్న నిట్టె జరగునో సారె మీ ఇద్దరికి
॥పల్లవి॥
పొలసి పొలసి యేమీ పొదిగీని యాపె నిన్ను
పిలిపించితివో నీవు ప్రియముతోడ
మొలక నవ్వులతో నీమొగము దప్పకచూచి
కలవో వొడఁబాట్లు కడు మీ యిద్దరికి
॥ఇన్నా॥
చేరి చేరి వూడిగాలు సేయఁగవచ్చీ నీకు
కారణమేమైనాఁ గద్దో కాఁగిటికిని
నేరుపుతో సలిగెలు నెరపీ నీముందరను
యీరీతి వేడకాయనో యిట్టె మీ ఇద్దరికి
॥ఇన్నా॥
పెనఁగి పెనఁగి యాపె బెరసి నవ్వీ నీతో
చనవు నీ వొసఁగినచందమో యిది
యెనసితి శ్రీవేంకటేశ యింతిలో నన్ను
మనసు లొక్కటాయనో మరి మీ యిద్దరికి
॥ఇన్నా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము