శృంగార సంకీర్తన
రేకు: 1938-6
సంపుటము: 29-168
రేకు: 1938-6
సంపుటము: 29-168
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఎన్నటి చుట్టరికమో యీపెకు నీకు నన్ను నేలితి విపుడు నమ్మించి యిన్నిటాను | ॥పల్లవి॥ |
| చెనకి చెనకి నీతో చిరునవ్వు నవ్వుకొంటా మనవు లెంత చెప్పీని మగువ గునిసి గునిసి సిగ్గు కుప్పలు వోసుకొంటా పెనఁగులాడె నప్పటి పెక్కుచందములను | ॥ఎన్న॥ |
| జరసి జరసి మోవి చవులు వుట్టించుకొంటా మరగులేల పెట్టీని మాఁటలలోన కరఁగి కరఁగి బత్తి కానుకలు వట్టుకొంటా గురుతులెట్టు చూపీని గుబ్బలపై నీకు | ॥ఎన్న॥ |
| తగిలి తగిలి మొక్కి తమకము రేఁచుకొంటా మొగమేమి చూపీ నీముందరనుండి జిగి నలమేల్మంగను శ్రీవేంకటేశ యేలితి - విగురుఁబోఁడి నీ కీపె నిల్లాలయి వున్నది | ॥ఎన్న॥ |


