Display:
శృంగార సంకీర్తన
రేకు: 1940-1
సంపుటము: 29-175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
అన్నిటా దొరవయితే నౌదువుగాని
విన్నవించితి నిప్పుడే వెలఁది చందములు
॥పల్లవి॥
సిగ్గరిపెండ్లికూఁతురు సేసవెట్టీ నిదె నీకు
వొగ్గి తలవంచవయ్యా వొద్దికతోను
కగ్గులేక యప్పటి నీకాలు దొక్కీ వేడుకతో
యెగ్గులు వట్టేవుసుమ్మీ యిందుకుఁగాను
॥అన్ని॥
కలికి నీ మరఁదలు కంకణము గట్టీ నీకు
లలిఁ జేయి చాఁచవయ్యా లాలనతోను
యెలయించి సన్నలనే యెంగిలిమోవి చూపీని
మలసి దూరేవుసుమ్మీ మన్నింతువు గాని
॥అన్ని॥
దేవు లలమేలుమంగ తెరదీసి చెనకీని
సేవ సేయించుకోవయ్యా శ్రీవేంకటేశ
వోవరిలోనికి దీసి వురమెక్కీ నింతలోనె
యేవేళా దించేవుసుమ్మీ యిట్టె వుందువుగాని
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము