Display:
శృంగార సంకీర్తన
రేకు: 1940-5
సంపుటము: 29-179
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
నిన్నుఁ బాయఁగలఁడటే నిమిషమైనా నీతఁడు
వున్నతి నీ కతలనే వోలలాడు నీతఁడు
॥పల్లవి॥
తాపపు విరహమేలే తలవంచుకొననేలే
నీపై బత్తిఁగలఁడు నీమగఁడు
మాపు దాఁకా చింతలేలే మమ్ము నింతడుగనేలే
యేపొద్దు నీ గుణములే యెంచుకొను నీతఁడు
॥నిన్నుఁ॥
లేకలు వాయించనేలే లేమల నంపఁగనేలే
వాకిటికి నింతలోనే వచ్చె నీతఁడు
జోకతో సగినాలేలే చూచి తమకించనేలే
నీకుఁగానే యాకారు నిచ్చ నిచ్చా నీతఁడు
॥నిన్నుఁ॥
చెక్కిటిచే యిఁకనేలే సిగ్గులు వడఁగనేలే
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డేలె నిన్నును
మొక్కులు మొక్కఁగనేలే ముసిముసినవ్వులేలే
మక్కువ నీ రతులే మరిగినాఁ డీతఁడు
॥నిన్నుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము