శృంగార సంకీర్తన
రేకు: 1941-4
సంపుటము: 29-184
రేకు: 1941-4
సంపుటము: 29-184
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| నేరము లెంచకుమయ్య నీ విన్నిటా ఘనుఁడవు తారుకాణగా నిఁక దయసేయవయ్యా | ॥పల్లవి॥ |
| చెలిని మన్నించుమని సేసితి విన్నపాలెల్లా పలుమారు మొక్కితి నీ పాదములకు వెలయఁగఁ జెక్కునొక్కి వేఁడుకొంటిఁ జనవున తలఁచి చిత్తానఁబెట్టి దయసేయవయ్యా | ॥నేర॥ |
| పెక్కులాగులను నీకుఁ బ్రియము లిదె చెప్పితి ఇక్కడ నీచే నమ్మిక లిప్పించుకొంటి అక్కరతో నీమీఁది ఆసలెల్లా దెలిపితి తక్కక చిత్తానఁ బెట్టి దయసేయవయ్యా | ॥నేర॥ |
| చెప్పరాని వినయాలసేవల కొడిగట్టితి ముప్పిరి నీపై పదముల వాడితి ఇప్పు డిట్టె శ్రీవేంకటేశ యీకె నేలితివి తప్పక చిత్తానఁబెట్టి దయసేయవయ్యా | ॥నేర॥ |


