శృంగార సంకీర్తన
రేకు: 1941-5
సంపుటము: 29-185
రేకు: 1941-5
సంపుటము: 29-185
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
| మీరేమి బుద్ధిచెప్పేరే మెలుఁతలాలా నా రమణుని గుణాలు నాకే తెలుసును | ॥పల్లవి॥ |
| సంతోసాన నుండి సరసములాడవచ్చుఁగాక పంతములాడవచ్చుగా పతితోను దొంతర రతుల గూడి తులఁదూఁగవచ్చుఁగాక వింత వింత కపటాల విఱ్ఱవీఁగవచ్చునా | ॥మీరే॥ |
| చొక్కముగా సేవసేసి సొలయఁగవచ్చుఁగాక కక్కసించవచ్చునా కాంతునితోను చెక్కునొక్కి చనవునఁ జెనకఁగవచ్చుఁగాక పెక్కులాగుల జంకించి పెనఁగఁగవచ్చునా | ॥మీరే॥ |
| కూరిమితో నవ్వు నవ్వి కొసరఁగవచ్చుఁగాక బీరమాడవచ్చునా ప్రియునితోను యీరీతి శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె దారకపు చేఁతలను తప్పులెంచవచ్చునా | ॥మీరే॥ |


