Display:
శృంగార సంకీర్తన
రేకు: 1942-4
సంపుటము: 29-190
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఇటువంటి వినోదము లిద్దరికిఁ దగునమ్మ
తటుకనఁ జూడరమ్మ తరుణులాల
॥పల్లవి॥
యెదురుఁ గొండలమీఁద నెక్కుకొని లకిమమ్మ
పొదిగొనఁ దొంగిచూచి పొంచుకుండఁగా
గుదిగొన వేదాద్రిగుహలోనఁ గూచుండి
అదివో చేతులుచాఁచీ నోభళేశుఁడు
॥ఇటు॥
అందముగ భవనాశి యద్దరిని లకిమమ్మ
విందుగాఁ జెలులచే వీడె మంపఁగా
కుందణఁపు మేడలోన గూచుండి నవ్వు నవ్వి
అందుకొనీ వేడుకతో నౌభళేశుఁడు
॥ఇటు॥
కడపవాకిటనుండడి గరిమతో లకిమమ్మ
తడయక మాఁటలాడి తమి రేఁచఁగా
తొడమీఁద నిక్కించుక దోమటి పెండ్లియాడి
అడరీ శ్రీవేంకటాద్రి నౌభళేశుఁడు
॥ఇటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము