శృంగార సంకీర్తన
రేకు: 1942-5
సంపుటము: 29-191
రేకు: 1942-5
సంపుటము: 29-191
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఆఁటది బతిమాలితే నారజకత్తె యందురు యేఁటికి నన్నుఁ గొసరే విన్నిటా జాణఁడవు | ॥పల్లవి॥ |
| జలజాక్షి యొకతె నీ సంగడిఁ గూచుండఁగాను సొలయక వేరొకతెకుఁ జోట్టున్నదా కలికి యొకతె నీకుఁ గైదండ కిచ్చుకుండఁగా చలపట్టి పెనఁగితే చప్పనగాదా | ॥ఆఁట॥ |
| మగువ యొకతె నీతో మాఁటలాడుచుండఁగాను తగుల వేరొకతెకుఁ దగవయ్యీనా మృగనేత్రి నీ కొకతె మేకొని సేవసేయఁగా జిగిమించి నీతోనవ్వ సిగ్గుగాదా | ॥ఆఁట॥ |
| వనిత యొకతె నిన్ను వసము సేసుకొండఁగా చెనక వేరొకతెకుఁ జెల్లుబడౌనా యెనసితివి శ్రీవేంకటేశ నీవె నన్నింతలో నిన్ను నిఁక మెచ్చేదే నేరుపుగాదా | ॥ఆఁట॥ |


