Display:
శృంగార సంకీర్తన
రేకు: 1942-6
సంపుటము: 29-192
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
నిన్నుఁ జూ చెప్పటనుండి నేఁడు నాకు వెరగయ్యీ
పన్నుకొని యెన్నేసి పగటులదానవే
॥పల్లవి॥
చనవులు సేసుకొని సరసము లాడి యాడి
వినయానఁ జెక్కునొక్కి వేఁడుకొనేవు
మనసు రంజిల్లఁ జేసి మచ్చికలు చల్లేవు
యెనసి విభుని కెంత యిచ్చకురాలవే
॥నిన్నుఁ॥
సరసనే కూచుండి సారెకునుఁ గొప్పు దువ్వి
విరులు ముడిచి యిట్టె విడి మిచ్చేవు
తెరవేసుకొని మోవితేనియలే కురిసేవు
యిరవై మగని కెంత యితవరి దానవే
॥నిన్నుఁ॥
వేవేగఁ గాఁగిలించి వేడుకలు వెడరేఁచి
కైవసము సేసుకొని కరఁగించేవు
యీవేళ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
నీవూ నీతని కెంత నెయ్యమైనదానవే
॥నిన్నుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము