శృంగార సంకీర్తన
రేకు: 1943-3
సంపుటము: 29-195
రేకు: 1943-3
సంపుటము: 29-195
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| తరుణిలో నా మనసు తా నెరఁగఁడా తెరదీసి నే నింత తెలుపఁగవలెనా | ॥పల్లవి॥ |
| వేడుకకు నవ్వితేను వెంగెమనీ యిదియేమే వాడుమోము చూచితేను వంచుకోనేలే చూడవే తా నంతే కడు సుద్దాత్ముఁ డైతేను వోడక తా నొక్కరీతి నుండవలదా | ॥తరు॥ |
| దగ్గరఁ గూచుండితేను తప్పించుకో నదియేలే వొగ్గి చెనకితే నట్టె సిగ్గు లేఁటికే యెగ్గులుఁ దప్పులుఁ దాను యెరఁగనివాఁడైతే దిగ్గన నా మాఁట సమ్మతించి వుండవలదా | ॥తరు॥ |
| చేరి మొక్కుమొక్కితేను చెక్కు నొక్కి వేఁడనేలే గారవించఁగాఁ బెనఁగఁగ నేఁటికి యీరీతినుండి శ్రీవేంకటేశుఁడు న న్నిప్పుడేలె మేరమీర కిటులానే మెలఁగఁగవలదా | ॥తరు॥ |


