Display:
శృంగార సంకీర్తన
రేకు: 1943-5
సంపుటము: 29-197
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
తారకబ్రహ్మమంత్రము తానై వున్నాఁడు రాముఁడు
ధారుణిలోఁ జెలువొందె దశరథరాముఁడు
॥పల్లవి॥
కొండలంతలు వానరకోటులు గొలువఁగాను
దండితోఁ గొలువున్నాఁడు తగ రాముఁడు
అండనే సీతాదేవి యమరి కూచుండఁగాను
మెండుగ సింహాసనాన మెరసీని రాముఁడు
॥తార॥
వామదేవ కౌశిక వసిష్ఠాదులవిన్నపా -
లాముకొని వినుచున్నాఁ డదె రాముఁడు
గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు
కామించి పట్టుకుండఁగా కడుమించీ రాముఁడు
॥తార॥
కనకపుష్పకము చెంగట వీరాసనముతో
ననచి యానందాన నున్నాఁడు రాముఁడు
ఘన శ్రీవేంకటాద్రిపైఁ గల్పవృక్షము నీడ
హనుమంతుని చదువు లాలకించీ రాముఁడు
॥తార॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము