శృంగార సంకీర్తన
రేకు: 1944-2
సంపుటము: 29-200
రేకు: 1944-2
సంపుటము: 29-200
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| సేసిన చేఁతులు చెల్లె చెప్పిన మాఁటలు వింటి రాసికెక్కె నీ సుద్దులు రక్షించు మమ్మును | ॥పల్లవి॥ |
| చిగురుమోవి వంచి సిగ్గువడ నేమిటికి మొగమెత్తి చూడవయ్యా మోక్కే నీకు అగుడునిట్టూరుపులు అడఁచుకొనఁదగదు నగవయ్యా వొకమాటు నాతో నీవు | ॥సేసి॥ |
| కొప్పు జారినందుకుఁగాఁ గొంచించ నేమిటికి చెప్పవయ్యా యేమాఁటైనా జేరి వినేను తొప్పఁదోఁగే చెమటలు తుడుచుకోనంతయాల అప్పుడే విసరేఁగాని అండకు రావయ్యా | ॥సేసి॥ |
| కందువైన వాసనలు కప్పిపెట్ట నేమిటికి ఇందవయ్యా జవాది ఇచ్చే నేను ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి చెంది యొక్కమనసుతోఁ జెలరేఁగు మిఁకను | ॥సేసి॥ |


