Display:
శృంగార సంకీర్తన
రేకు: 1944-6
సంపుటము: 29-204
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
విన్నవించ వసగాదు వెలఁది భావములెల్లా
అన్నిటా నీవే యిఁక నాదరించవయ్యా
॥పల్లవి॥
చన్నులమీఁది పయ్యెద జారినదీఁ దలఁచదు
సన్నలు నీతోఁ జేసె సంతోసానను
చిన్నిచెమట చెక్కులఁ జిందేదీ నెఱఁగదు
కన్నుల నిన్నుఁ జూచే కాంక్షలను
॥విన్న॥
తురుములోని విరులు తొరిగేదీ నెంచదు
నిరతి నీతో మాఁటాడే నిబ్బరానను
మురిపినఁ దనపోఁకముడి వీడినాఁ బట్టదు
సరుగ నీపై వలపుచల్లే వేడుకలు
॥విన్న॥
ముంచి పులకలు మే మొలచినదీఁ జూడదు
అంచెల నిన్నుఁ గూడేటి యాసలను
కొంచక శ్రీవేంకటేశ కొమ్మ నిట్టె యేలితివి
చెంచెలించదు నీరతి సరసానను
॥విన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము