Display:
శృంగార సంకీర్తన
రేకు: 1945-1
సంపుటము: 29-205
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
వినయాన వేఁడుకొనే వెసఁ దెరవేయరే
చెనకఁగా నిందరిలో సిగ్గయ్యీ నాకును
॥పల్లవి॥
రాఁపుసేసి వలపులు రచ్చనేల పెట్టీనే
కాఁపురము నేరుతునా కన్నెదానను
పూఁపచన్ను లంటి యంటి పొందు లెంతసేసీనే
దాపునఁ దల్లి మరఁగుదాన నింతే నేను
॥విన॥
సన్నలాఁ జాయల మోవిచవు లెంత చూపీనే
వున్నతితో గుట్టుసేసుకుండే దానను
నున్నని చెక్కులమీఁద నునుగోరే లూఁదీనే
మిన్నక గోలతనపుమేలుదానను
॥విన॥
రచ్చలోన సిగ్గులెల్లా రాసు లేల పోసీనే
కచ్చుపెట్టి మోక్కే యిచ్చకపుదాను
యిచ్చట శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నేఁడు
మెచ్చుగా బెండ్లాడిన మేనదాన నేను
॥విన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము