Display:
శృంగార సంకీర్తన
రేకు: 1946-3
సంపుటము: 29-213
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
విన్నపము సేయవమ్మా విభునికి సుద్దులు
చెన్నుగా నేమి సేతము చెప్పరమ్మా బుద్దులు
॥పల్లవి॥
యెనలేని వలపుల యీఁతలు
మునుకొన్న నిట్టూర్పుల మోఁతలు
పొనుగొని సిగ్గుల పూఁతలు
వనితకు మరుఁడు సేసిన చేఁతులు
॥విన్న॥
కలసేటి తమకపు కరఁగులు
మలయుఁ జెక్కిటి చేయి మఱఁగులు
సెలసి పయ్యెదజారు చెఱఁగలు
చెలియకే మరుఁడుసేసిన తెఱఁగులు
॥విన్న॥
మరిగిన విరహపు మందులు
వెను కొన్నభావరతి విందులు
యిరవై, శ్రీవేంకటేశుఁ డిందులోనె వచ్చి కూడె
తరుణి కింతసేసిన తగు పొందులు
॥విన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము