Display:
శృంగార సంకీర్తన
రేకు: 1946-4
సంపుటము: 29-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
నీకేల మొగమోట నే నెంతటి దానను
కాకుసేసి యిందుకుఁగా కాఁతాళించేనా
॥పల్లవి॥
ఆపె నీవూఁ గూచుండి అంతనేల రమ్మనేవు
చేపట్టి కాఁపురములు సేతురుగాక
యేపున నన్నుఁ జూచి యేల ప్రియాలు చెప్పేవు
వోపుదు వెంతటికైనా వొద్దనేనా నేను
॥నీకేల॥
యిద్దరును నవ్వుకొంటా యేల నాతో మాటాడేవు
వొద్దిక సరసలాడి వుందురుగాక
బుద్ది దలఁచుక నన్నుఁ బొత్తులేల కలిపేవు
కొద్దిమీరి పంగించి కొసరేనా నేను
॥నీకేల॥
ఆలు మగఁడునుఁ గూడి ఆస నాకెంత వెట్టేరు
కోలుముందై రతిఁ బెనఁగుదురుఁగాక
యీలీల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
పాలింతువుగాక ఇంకాఁ బంగించేనా నేను
॥నీకేల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము