Display:
శృంగార సంకీర్తన
రేకు: 1947-1
సంపుటము: 29-217
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎంత నన్ను వేఁడుకొనే విప్పుడు నీవు
పంతములు మీరేటి పడతినా నేను
॥పల్లవి॥
యే పొద్దూ సేవ సేసేటి యిచ్చకురాలనేకాక
కోపగించుకొనియేటి కొమ్మనా నేను
చేపట్టి నీ వేమనినా చిత్తములోఁదానఁగాక
నీ పలుకు మీరేటి నెలఁతనా నేను
॥ఎంత॥
యే దెసా నీకు లోనై యెనసేటి దానఁగాక
కాదుగూడదనేటి కాంతనా నేను
మోదముతో నిన్నుఁ జూచి మొక్కేటిదానఁగాక
సాదించి జంకించేటి సతినా నేను
॥ఎంత॥
మేరతో నీ కాఁగిటిలో మెలఁగేటిదానఁగాక
సారెకుఁ గొసరేయట్టి సకినా నేను
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చేరి మేలు మరచేటి చెలియనా నేను
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము