Display:
శృంగార సంకీర్తన
రేకు: 1947-4
సంపుటము: 29-220
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
కంటి నీ సుద్దు లెల్లాను కానీ కానీవే
అంటి ముట్టినంతలోనె ఆలవయ్యేవా
॥పల్లవి॥
మనసు పట్టఁగలేక మాఁటలాడి యాతనితో
తనివి సేసుకొనేవు తగునే నీవు
చనవున నప్పటిని జవ్వాది వూసేనంటా
పెనఁగులాడేవౌనే ప్రియునితోను
॥కంటి॥
పాయరాని తమితోడ పకపక నవ్వుకొంటా
ఆయాలు గరఁచుకొనే వాసతో నీవు
యీయెడ నంతటాఁ బోక యింటికిఁ బిలిచెనంటా
చెయివట్టి పొందులు సేసేవౌనే నీవు
॥కంటి॥
కోలుముందై వేడుకతో కొచ్చి కొచ్చి చూచి చూచి
తాలిమి సేసుకొనేవు తగిలి నీవు
మేలువాఁడై నన్ను నేలె మించి శ్రీవేంకటేశుఁడు
కాలు దొక్కి మొక్కేవౌనే ఘనుఁడీతఁ డంటాను
॥కంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము