Display:
శృంగార సంకీర్తన
రేకు: 1949-2
సంపుటము: 29-230
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
వెలఁది సొబగులివి విన్నవించితిమి
నెలకొని ఇఁకఁ గరుణించవయా
॥పల్లవి॥
చెలపల చెలపల చెమటలు గారీ
వలపునఁ బొడమిన వానలివి
సొలపుల సొలపుల చూపులు వొదలీ
తెలుపుగ వెన్నెల తేటలివి
॥వెలఁ॥
బుసబుసమను నూర్పులు చిగిరించీ
వసంతకాలపువరుసలివి
మిస మిసఁ గాంతులు మెరుఁగులు వారీ
యెసఁగిన విరహపు టెండలివి
॥వెలఁ॥
మది మదిఁ గోర్కుల మంచులు గురిసీ
మదనుని యలహేమంత మిది
యిదె యిదె శ్రీవేంకటేశ యింతిఁ గూడితి
వదలనికాఁగిళ్ళవాడికలివి
॥వెలఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము