Display:
శృంగార సంకీర్తన
రేకు: 1949-4
సంపుటము: 29-232
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతవరాళి
దేవరకు మోహించిన తెరవలు వచ్చినారు
వేవేలకు విన్నవించే విన్నపాలవారము
॥పల్లవి॥
బత్తితోఁ జనుగుబ్బలు పడఁతి కానుక చూపీ
హత్తి చేయి చాఁచవయ్యా అవధరించి
తత్తరాన నివాళిచ్చీ తళుకు చూపులనె
యిత్తల నెచ్చరికతో నిటు చూడవయ్యా
॥దేవ॥
వేడుకతో మోవితేనెవిందులు నీకుఁ దెచ్చె
కూడి నోరారాఁ జేకొనవయ్యా
వాడిక నవ్వులనే సేవంతివిరు లోసగీని
తోడనే మేలు మీఁద నందుకొనవయ్యా
॥దేవ॥
చుట్టరికపు మాఁటలు సొరిది నీకుఁజెప్పీ
వొట్టుకొని వొక లేమ వూఁకొనవయ్యా
ఇట్టె శ్రీవేంకటేశ యిందరిని నేలితిని
గట్టిగా సేవలుగొని కరుణించవయ్యా
॥దేవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము