Display:
శృంగార సంకీర్తన
రేకు: 1949-5
సంపుటము: 29-233
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మేఁచబౌళి
మఱి నే మెంతడిగినా మాకుఁ జెప్పదు
గుఱుతులు నీవే చూచుకొందువు రావయ్యా
॥పల్లవి॥
చేరఁడేసి కన్నులాపె చెంగలి చూపులది
నీరాకగోరి వాకిట నిలుచున్నది
చేరి నవ్వుకొంటా నీపసిఁడిగద్దెపై నున్నది
కోరి యాపెపే రడుగుదువు రావయ్యా
॥మఱి॥
పట్టెఁడెసి చన్నులది బంగారువంటిమేనిది
పట్టుపచ్చడము నీది పరచుకొన్నది
దిట్టయై నిన్నుఁ బలిచి తెమ్మనియంటానున్నది
గట్టుతో నీ వాకెఁ గనుఁగొందువు రావయ్యా
॥మఱి॥
దండి మీఁటి నీమీఁది పదాలు వాడుతానున్నది
అండనె నీవు మగఁడవంటానున్నది
దండిగా శ్రీవేంకటేశ తగవిచ్చి కూడితివి
నిండు నిధానమవై నెమ్మది నుండవయ్యా
॥మఱి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము