Display:
శృంగార సంకీర్తన
రేకు: 1950-3
సంపుటము: 29-237
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
ఇన్నాళ్లూ నెఱఁగము నీ వింతటివాఁడవౌత
పన్నుక యెవ్వతె నిన్నుఁ బనుపరచినదో
॥పల్లవి॥
మాపుదాఁకా నేరుపులే మాతోఁ బచరించేవు
యే పళ్లిఁ జదివితివో యింతేసి నీవు
రాఁపుగా జాణతనాలు రామలతో నాడేవు
చేపట్టి యెవ్వతె నీకు సెలవులు వెట్టెవో
॥ఇన్నా॥
పూనుకొని యెందుకైనా పొసఁగ మాఁటాడేవు
యే నెలఁత నేరిపెనో యింతేసి నీకు
నానఁబెట్టి నానఁబెట్టి నవ్వులు నవ్వ వచ్చేవు
సేనగా నీ కలవాటు సేసినది యెవ్వతో
॥ఇన్నా॥
అందుకోలువలపులు అమ్మవచ్చే వప్పటిని
యెందు బేరాలాడితివో యింతేసి నీవు
కందువ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
పొంది నిన్ను నెవ్వతె పోరచి మరపెనో
॥ఇన్నా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము