Display:
శృంగార సంకీర్తన
రేకు: 1951-4
సంపుటము: 29-244
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తెలుఁగుఁగాంబోది
మగువ నిన్నే కాని మరి యన్య మెఱఁగదు
జిగి నీపై వలపులు చిత్తగించవయ్యా
॥పల్లవి॥
చన్నులమీఁది పయ్యద జారినదీ నెఱఁగదు
కిన్నెర మీఁటి నిన్ను గిలిగించీని
చిన్ని చెక్కులఁ గారేటి చెమటలు నెఱఁగదు
యెన్నిక తానాల తోడ నెలుఁగెత్తి పాడీని
॥మగువ॥
తురుము వీడి విరులు తొరిగేది నెఱఁగదు
సిరుల నీపైఁ బదాలు చెప్పి చొక్కీని
సరుగన మొలనూలు సళ్లినదీ నెఱఁగదు
వరుస నీ గుణాలెల్లా వ్రాసి వర్ణించీని
॥మగువ॥
పొదలిన మేనెల్లా బలకించే దెఱఁగదు
సదరాన నిన్నుఁ గూడి సంతోసించీని
పెదవిపై కెంపులు బెరసిన దెఱఁగదు
యిదె శ్రీవేంకటేశ ని న్నెచ్చరిక సేసీని
॥మగువ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము