Display:
శృంగార సంకీర్తన
రేకు: 1951-5
సంపుటము: 29-245
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇట్టె కరుణించవద్దా యింతటనైనా
నెట్టుకొన్న వినయాన నెలకొన్నదానను
॥పల్లవి॥
మునుకొని చేతులెత్తి మొక్కితి నప్పుడె నీకు
చనుఁగవ యే లంటేవు సారెకునని
ననిచి పెట్టరానియానలెల్లా నీకుఁ బెట్టితి
గానకొని చెక్కులపై గోర గీరకుమని
॥ఇట్టె॥
లలి మోవి తేనియాలు లంచము లిచ్చితి నీకు
తిలకించి మానముపైఁ దిట్టకుమని
పిలిచినా చిలుక నీ పేరువెట్టి వేఁడుకొంటి
యెలమి నా సిగ్గులు బాయిట వేయకుమని
॥ఇట్టె॥
కదిసి వినయముతోఁ గాఁగిలించుకొంటి నిన్ను
పదరి యెన్నఁడూ నన్నుఁ బాయకుమని
యిదె శ్రీవేంకటేశ న న్నేలినందుకు మెచ్చితి
సదరాన నీవే భువి జాణఁడవని
॥ఇట్టె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము