Display:
శృంగార సంకీర్తన
రేకు: 1954-5
సంపుటము: 29-263
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
ఎంత వేగిరకాఁడే యీతఁడు తాను
అంత బత్తి గలిగితే నప్పుడే రావలదా
॥పల్లవి॥
దివ్వెలెత్తుఁ బొద్దుకాడ దిక్కులనుండి వచ్చీ
నవ్వు లేమి నవ్వీనే నాతోఁడాను
పవ్వళించి యింటిలోన పనిలేదు పాటలేదు
పువ్వుల నేల వేసీనే పూఁచి పూఁచి నన్నును
॥ఎంత॥
వరవాతా లేచివచ్చి వద్దని నే మొక్కఁగానె
సరసము లే మాడీనే సారె నీతోను
యిరవై తెరవేసుక యిందుకే కాచుకవుండి
కెరలించి యేల గిలిగించీనే నన్నును
॥ఎంత॥
పట్టపగలె వచ్చి పాదా లొత్తమంటాను
చుట్టరిక మొంతసేసి చూపీ నితఁడు
యిట్టె శ్రీవేంకటేశుఁ డితఁడె తా నన్ను నేలె
గుట్టుతోడ మరి యాల కొసరీని నన్నును
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము