శృంగార సంకీర్తన
రేకు: 1956-5
సంపుటము: 29-275
రేకు: 1956-5
సంపుటము: 29-275
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| ఇటువంటి సతి పొందు లెంతని పొగడవచ్చు తటుకన నీకు నబ్బెఁ దగు మీ యిద్దరికి | ॥పల్లవి॥ |
| చిందేటి పెదవి తేనె చిప్పిలఁగాఁ జెలి నీతో మందలించి నోరు నిండా మాఁటలాడెను చందమామవంటి మోము చక్క నెత్తి వేడుకతో కందువ నీ ముందరను కలకల నవ్వెను | ॥ఇటు॥ |
| జారిన పయ్యదలోని చనుఁగవ గానరాఁగా గారవముతోడ నీకుఁ గాను కిచ్చెను బారెఁడేసి నెరిఁగొప్పుపాదాలపై సోఁకఁగాను కూరిమితో నీకు నిట్టె గురుతుగా మొక్కెను | ॥ఇటు॥ |
| బంగారువంటి చేతులఁ బట్టి నీ చెక్కులు నొక్కి చెంగలించి విడెము నీ చేతి కిచ్చెను అంగపుఁజెమటతో ని న్నలమి శ్రీవేంకటేశ వుంగిటిగా రతుల ని న్నోలలాడఁజేసెను | ॥ఇటు॥ |


