Display:
శృంగార సంకీర్తన
రేకు: 1956-6
సంపుటము: 29-276
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఈ కాంత నేలిన యీతఁ డెంత భాగ్యవంతుఁడే
చేకొన్న సంతోసాన చెలరేఁగీ వీఁడివో
॥పల్లవి॥
కలికి కన్నుల చూపు కమ్మమోవి తరితీపు
చెలియ చక్కని రూపు చెప్పఁ గొత్తలు
మొలక చన్నుల వొప్పు ముంగురుల పెనుఁగొప్పు
చెలపచెమటచొప్పు చెలులాల చూడరే
॥ఈకాంత॥
మొగములోపలితీరు ముతైపు కుచ్చలపేరు
సొగసుఁ బయ్యద జారు చొక్కమాయనే
నగవు లోపలి సిగ్గు నవకపు మేని నిగ్గు
మగువ మొక్కుల తగ్గు మంచిదే కదరే
॥ఈకాంత॥
కడుసింగారాలసొంపు కందువమాఁటల యింపు
నడపులలోని జంపు నయమేకదే
యెడయక శ్రీవేంకటేశుఁ డిట్టె యీకెఁ గూడె
విడువని రతిపెంపు వేడుకలై మించెనే
॥ఈకాంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము