శృంగార సంకీర్తన
రేకు: 1958-4
సంపుటము: 29-286
రేకు: 1958-4
సంపుటము: 29-286
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇంతికిని నీకుఁ దగు నిటువంటి నేరుపులు పొంతఁ గలకాలమును భోగించరయ్యా | ॥పల్లవి॥ |
| నిలిచి నవ్విన నవ్వు నివ్వెరగు నొందించు సొలసి చూచిన చూపు చొక్కించును పిలిచి యాడిన మాఁట ప్రియమెల్లాఁ బుట్టించు తలఁచి మెచ్చిన మెచ్చు తమిరేఁచును | ॥ఇంతి॥ |
| చెనకి సేసిన చెలిమి చిత్తంబు గరఁగించు వినయంబు గలపొందు వెలయించును పెనఁగి పెట్టిన విందు బెరసి చవి వుట్టించు ననుపైన సరసంబు నానాఁటఁ బొదలు | ॥ఇంతి॥ |
| తగిలి వలచిన వలపు తరితీపు వుట్టించు మొగమోట నెయ్యంబు మొక్కించును మిగుల శ్రీవేంకటేశ మెలుఁత నిటు గూడితివి చిగురుఁ గోరికలు మిముఁ జెంగలింపించు | ॥ఇంతి॥ |


