Display:
శృంగార సంకీర్తన
రేకు: 1958-6
సంపుటము: 29-288
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాగగాంధారి
విన్నవించితిమి నీకు వెలఁది భావములెల్లా
మన్నించి నీ దేవులకు మచ్చిక చూపవయా
॥పల్లవి॥
చుట్టరికమైనవారు సోఁక నెంత యాడినాను
గుట్టుతో నుండుటగాని గుంపించరాదు
పొట్టఁబొరుగులవారు పూఁచి యెంత చెనకినా
అట్టె నవ్వుటగాని యౌఁ గాదనరాదు
॥విన్న॥
నమ్మికైనవారు యెంత నట్టుకొట్టి సొలసినా
సమ్మతించుటేకాని జరయరాదు
యిమ్ములఁ జెలులైనవా రెగ్గు లెన్ని యెంచినాను
కమ్మటిఁ జేకొంటగాని కాఁతాళించరాదు
॥విన్న॥
బత్తిగలవారు యెంత పంతములు చూపినాను
హత్తి చొక్కుటగాని మారాడఁగరాదు
యిత్తల శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
కొత్తగా మెచ్చుటగాని కొసరరాదు
॥విన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము