Display:
శృంగార సంకీర్తన
రేకు: 1959-4
సంపుటము: 29-292
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
మాపు దాఁకా జోలి యేల మానఁగదవే
చేపట్టి యాతఁడు నా చిత్తములోఁ బాయఁడు
॥పల్లవి॥
అతనిపై తమకము ఆఁపఁగలేనే
యితవుగా నీ బుద్దులు యేమి చెప్పేవే
మితిమీరి యతనికి మేలుదాననే
చతురత నీ మాఁటలు చవులుగావే
॥మాపు॥
మలసి యాతని పొందు మానఁగరాదే
వెలయఁగ నీవెంత వేఁడకొనేవే
వలపుగాదని తోయవచ్చునటవే
పలుమారు నాతో నేల పట్టి పెనఁగేవే
॥మాపు॥
మన సాతనిపైఁ బెట్టి మరిగితినే
నను గిలిగించే యేమి నవ్వించేవే
యెనసె శ్రీవేంకటేశుఁ డిదివో నన్ను
మొనసి యెన్నేసి నీవు మొక్కులు మొక్కేవే
॥మాపు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము