శృంగార సంకీర్తన
రేకు: 1960-1
సంపుటము: 29-295
రేకు: 1960-1
సంపుటము: 29-295
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఆఁటదాని నన్ను నేఁటి కారడిఁ బెట్టీఁ దాను గాఁటముగ నెదురాడి కాదనేటి దాననా | ॥పల్లవి॥ |
| వేడుక గలిగితేను విడిదికి రానీవే యేడనైనా నాతోను యేల నవ్వీని వాడిక వలసితేను వద్దఁ గూచుండనీవే వోడక నన్నేల యింత వొరసి చూచీని | ॥ఆఁట॥ |
| తనకు నే బాఁటైతే తగఁ బెండ్లాడనీవే తనియక యెన్ని జాణతనా లాడీని పని గలిగితే నాకు బాగాలు వెట్టనీవే చెనకి మోవి సన్నలు సేసి యేమి చూపీని | ॥ఆఁట॥ |
| కరుణ నాపైఁ గలిగితే కాఁగిలించుకోనీవే విరుల వేసి నన్నెంత వేఁడుకొనీని యరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె మరిగి వుండనీవే మనసెంత రేఁచీని | ॥ఆఁట॥ |


