శృంగార సంకీర్తన
రేకు: 1960-3
సంపుటము: 29-297
రేకు: 1960-3
సంపుటము: 29-297
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| తప్పులెంచ మరియాల తలవంచుకొననేల చెప్పఁగల ప్రియములు చెప్పరమ్మా | ॥పల్లవి॥ |
| చింతలెల్లాఁ బెడఁబాసె సెలవుల నవ్వదేరె యింతలోనే విభుఁడు నీ యింటికి వచ్చె పంతము లాడేరె నిఁక బంగారు పీఁట వెట్టి వింతలేక యీతనికి విడె మియ్యవమ్మా | ॥తప్పు॥ |
| తనివిఁ బొఁదె మససు తలకూడెఁ గోరికలు చెనకి నీమగఁడు నీచేతికిఁ జిక్కె పనులెల్లాఁ జక్కనాయ పరపుపైఁ గూచుండి వినయాన మోవి తేనె విందువెట్టవమ్మా | ॥తప్పు॥ |
| సేసిన చేఁతలు చెల్లె సిగ్గులు మోమున నిండె ఆసతో శ్రీవేంకటేశుఁ డదె నిన్నేలె రాసికెక్కె నీ వలపు రతులను మెప్పించి మోసలేక వేఁడుకొని మొక్కు మొక్కవమ్మా | ॥తప్పు॥ |


